పోలీసు కుటుంబాల గోస వినండి – ఆర్ఎస్పీ
తెలంగాణ డీజీపీకి ఎక్స్ వేదికగా సూచన
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కినా స్పందించక పోవడం దారుణమన్నారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. రేయింబవళ్లు శాంతి భద్రతల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసుల పట్ల, వారి కుటుంబాల పట్ల చిన్న చూపు చూడటం తగదని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
సీఎం మూసీ సుందరీకరణ పేరుతో విలువైన కాలాన్ని వేస్ట్ చేస్తున్నాడని, కానీ పోలీసు కుటుంబాల గోస వినేందుకు టైం లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.
పోలీస్ బాస్ గా మీరైనా స్పందించాలని ఆయన కోరారు.
లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని, వారి మనసుల్లో అశాంతి అనేది ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికే పట్ట పగలు మర్డర్లు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత పద్దతిలోనే రికార్డెడ్ పర్మిషన్ (ఆర్పీ)ని కొనసాగించాలని కోరారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ప్రయోగం చేపట్టాలని సూచించారు ఆర్ఎస్పీ. పోలీసులు తమ సోదరుల భార్యలను ఈడ్చుకుంటూ పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని వాపోయారు.