NEWSTELANGANA

ప‌త్తి రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

Share it with your family & friends

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా – మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ప‌త్తి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్కిరంచాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి మ‌ద్ధ‌తు ధ‌ర‌, బోన‌స్ ఇప్పించాల‌ని కోరారు .

వెంట‌నే కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను క‌లిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు.

ఇట్టి సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ ను కోరామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. వరదల్లో పత్తి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోలేదని ఆరోపించారు.

ఎక్కడ కూడా వారికి ఒక రూపాయి సాయం చేసినట్లు గానీ.. వారి నష్టాన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. అదే సమయంలో పత్తి కి సంబంధించి మన రాష్ట్రం పట్ల కేంద్రం కూడా వివక్ష చూపిస్తుందన్నారు.

వాస్తవానికి గుజరాత్ రాష్ట్రం పండించే పత్తి కంటే తెలంగాణ రాష్ట్రం రైతాంగం పండించే పత్తి మంచిదని, నాణ్యమైందని అనేక సందర్భాల్లో (సిసిఐ) కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించిందిన్న విషయాన్ని ఈ సందర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి గుర్తు చేశారు.

గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రైతాంగానికి రూ. 8257 మద్దతు ధరను ఇప్పించాలని కోరారు. అలాగే తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 475 రూపాయలు బోనస్ ను కూడా ఇప్పించాలన్నారు.

వరుసగా అకాల వర్షాలతో పత్తి తడిసి పోయి దెబ్బతిన్నదని.. రావలసిన దిగుబడి కూడా అందలేదని.. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఎకరానికి 10 నుంచి 12 కింటాలు వరకు రావాల్సిన పత్తి ఈ ఏడాది అకాల వర్షాలతో నాలుగు కింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగానికి నష్ట పరిహారాన్ని కట్టించాలని.. దాని పైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు.

అదేవిధంగా ఇప్పటి వరకు సిసిఐ కి సంబంధించిన కేంద్రాలను ఎక్కడ కూడా ప్రారంభించలేదని.. అక్కడక్కడ ఒకటి రెండు కేంద్రాలు తెరిచినప్పటికీ వచ్చిన పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని.. అవంకతో పత్తిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు.