ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయండి
ఆదేశించిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతి చెందిన విషయం తెలుసుకుని అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్,ఆర్డీఎంఏ హరికృష్ణ , సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పొంగూరు నారాయణ.
మృతికి కారణాలపై ఇంకా స్పష్టత రాక పోవడంతో, బోర్లను అన్నింటిని మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేయాలని ఆదేశించారు మంత్రి. అంతే కాకుండా స్థానికంగా ఉన్న బోర్లలో నీటిని విజయవాడ ల్యాబ్ కు పరీక్షలకు పంపాలని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ.
సాధారణ పరిస్ధితి వచ్చే వరకూ మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని, అంతే కాకుండా వెంటనే ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏపీ మంత్రి. అంతా అప్రమత్తంగా ఉండాలని, అంతే కాకుండా ఏపీ వాతావరణ శాఖ దానా తుపాను వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించిన నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.