అన్న కౌంటర్ చెల్లెలు స్ట్రాంగ్ కౌంటర్
తాడో పేడో తేల్చుకుంటామన్న షర్మిల
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి ఆమె తన సోదరుడు, మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సోదరి, తల్లిపై కేసు వేస్తారా అని ప్రశ్నించారు. బుద్ది ఉన్న వారెవరూ ఇలాంటి పని చేయరని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఏమిటి అనేది ప్రజలకు తెలుసన్నారు.
బెదిరింపులకు భయపడే తత్వం తమది కాదన్నారు వైఎస్ షర్మిలా. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు . తండ్రికి చెందిన ఆస్తిలో తమకు కూడా వాటా ఉంటుందన్నారు. అన్న జగన్ , వదిన భారతీ రెడ్డిలు కోర్టుకు పోయినంత మాత్రాన, ఫిర్యాదు చేసినంత మాత్రాన పప్పులు ఏమీ ఉడకవన్నారు.
జగన్ రెడ్డి సంపాదించిన ఆస్తులతో తమకు కూడా సంబంధం ఉంటుందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉండడం సహజమేనని అన్నారు. అయినంత మాత్రాన తల్లి, చెల్లి అని చూడకుండా కారుకూతలు కూస్తానంటే ఊరుకుంటామా అని మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్.
రాజీకి రావాలంటూ నువ్వు లేఖ రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరిగి తమపై అభాండాలు మోపేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.