ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పనితీరుపై శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యా నాథ్ దాస్ , కార్యదర్శి
రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, నీటి లభ్యత, ప్రస్తుతం చేపట్టాల్సిన పనులు, ఇతర అంశాలపై చర్చించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టు పనులను చేపట్టాలని స్పష్టం చేశారు .
ప్రత్యేకించి ప్రాధాన్యత కలిగిన నీటి పారుదల ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. గతంలో కంటే ఈసారి ఎక్కువగా దేవుడి దయ వల్ల అత్యధికంగా వర్షాలు కురిశాయని, ఇది రాష్ట్రానికి శుభ సూచకమని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసినట్లయితే సాగుకు వీలవుతుందని, దీని ద్వారా ఆదాయం పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే తమ సర్కార్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు .