నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 300 కోట్లు
విడుదల చేశామన్న సత్యకుమార్ యాదవ్
అమరావతి – ఏపీ రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద నిలిచి పోయిన బకాయిలను విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ నిలిపి వేసిన బకాయిలపై సమీక్ష చేపట్టారు సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
శుక్రవారం ఆయన కీలక ప్రకటన చేశారు. ఏపీకి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) కింద నెట్ వర్క్ ఆస్పత్రులకు తీపి కబురు చెప్పారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లించకుండా ఉంచిన రూ. 2,500 కోట్ల బకాయిలకు గాను ప్రస్తుతానికి ప్రభుత్వం తరపున రూ. 300 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
ఎక్స్ వేదికగా మంత్రి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్ వర్క్ ఆస్పత్రులు గమనించాలని, బాధిత రోగులకు సాయం చేయాలని సూచించారు. త్వరలోనే మిగిలి పోయిన బకాయిలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్.
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
అప్పుల నుండి అభివృద్ధి వైపు, సంక్షోభం నుండి సంక్షేమం దిశగా ఆంధ్ర రాష్ట్రం పయనిస్తోందని స్పష్టం చేశారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి.