బంధాల గురించి షర్మిల మాట్లాడితే ఎలా..?
రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
అమరావతి – వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన జగన్ రెడ్డి సోదరి , ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని ఏకి పారేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కావాలని తన సోదరుడు అన్న సోయి లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించు కోవాలి..కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
ఇక్కడ షర్మిలా రెడ్డి మాట్లాడటం లేదని, ఆమె వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడని పూర్తిగా అర్థమై పోయిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , ఏనాడో ఆస్తులను పంపిణీ చేశారని, ఆ విషయం తెలియకుండా బాబు కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని షర్మిలమ్మనే కావాలని బజార్లోకి ఈడ్చారంటూ ధ్వజమెత్తారు. సత్యం ఏదో, అసత్యం ఏదో, స్వార్థం ఎవరిదో, శత్రువులతో చేతులు కలిపి జగన్ కు అన్యాయం చేసే కుట్ర గురించి చెప్పాలని డిమాండ్ చేశారు.
షర్మిలమ్మ అనుబంధాల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. జగన్ రెడ్డి ఇప్పటికే చెల్లెలి మీద ప్రేమతో వాటా కూడా ఇస్తానని చెప్పాడన్నారు. ఇప్పటికే తన స్వంత ఆదాయం నుండి రూ. 200 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. రాసి ఇచ్చిన ఎంఓయూ కూడా ఉందన్నారు. ఇకనైనా ఆరోపణలు మానుకోవాలని షర్మిలకు సూచించారు.