ఆరోగ్య శ్రీ కింద రూ. 1311 కోట్లు చెల్లింపు
స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్
అమరావతి – ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిలిచి పోయిన బకాయిలను పూర్తి చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. కావాలని నిరాధారమైన విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ఆరోగ్య శ్రీ కింద ఆయా నెట్ వర్క్ ఆస్పత్రులకు నిలిచి పోయిన రూ. 2500 కోట్ల బకాయిలను దశల వారీగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
ఇందులో భాగంగా ఇవాళ రూ. 300 కోట్లు క్లియర్ చేశామని వెల్లడించారు. తాము వచ్చిన ఈ 100 రోజులలో ఇప్పటి వరకు మొత్తం రూ. 1311 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం ఆకస్మికంగా మంత్రి గురజాల నియోజకవర్గాన్ని సందర్శించారు.
డయేరియా వ్యాధి ప్రబలిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే మిగతా బకాయిలను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు.