అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట
నవంబర్ 6 వరకు చర్యలు వద్దు
అమరావతి – ప్రముఖ నటుడు బన్నీ అలియాస్ అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది కోర్టు కేసులో. శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా వాదోప వాదనలు విన్న కోర్టు ఊరటనిచ్చేలా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉండగా ఏపీలో ఇటీవల శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నటుడు అల్లు అర్జున్. తన ప్రాణ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించ లేదని, రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది.
దీంతో నటుడు అల్లు అర్జున్ పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. బన్నీతో పాటు బరిలో నిలిచిన వైసీపీ పార్టీ అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా కేసులను కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది కోర్టు. కాగా నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశించింది. ఆరోజు తుది ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు బన్నీ, మాజీ ఎమ్మెల్యే.