బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది – సీఎం
అరవింద్ కేజ్రీవాల్ పై దాడి దారుణం
ఢిల్లీ – ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, మోడీ, అమిత్ షా ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పిరికి వాళ్లు మాత్రమే దాడులకు పాల్పడతారని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక దొడ్డి దారిన కేజ్రీవాల్ ను అంతం చేయాలని ప్లాన్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు.
ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదన్నారు. ఎవరు పాల్పడినా తప్పేనని అన్నారు . దీనిని సీరియస్ గా తీసుకుంటున్నామని, ఆప్ చూస్తూ ఊరుకోదన్నారు. తాము దేశం కోసం విలువైన ప్రాణాన్ని బలిదానం చేసిన షహీద్ భగత్ సింగ్ ను, భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని సీఎం అతిషి డిమాండ్ చేశారు.