కేజ్రీవాల్ పై దాడి అప్రజాస్వామికం
బీజేపీపై మనీష్ సిసోడియా ఆగ్రహం
ఢిల్లీ – ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, మోడీ, అమిత్ షా ఒంటెద్దు పోకడలకు ఈ దాడి నిదర్శనమని అన్నారు. తాము మాత్రమే ఈ దేశంలో ఉండాలని, మిగతా పార్టీలు, నేతలు ఉండ కూడదని వారు అనుకుంటున్నారని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేజ్రీవాల్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన బయలుదేరి వెళ్లారు. తమ పార్టీ అధినేతను పరామర్శించారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో తాము ఎలాగైనా సరే గెలవాలని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సిసోడియా.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పిరికి వాళ్లు మాత్రమే దాడులకు పాల్పడతారని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక దొడ్డి దారిన కేజ్రీవాల్ ను అంతం చేయాలని ప్లాన్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు మనీష్ సిసోడియా.