NEWSNATIONAL

ప్ర‌జాస్వామ్యంలో దాడుల‌కు తావు లేదు – సీఎం

Share it with your family & friends

అర‌వింద్ కేజ్రీవాల్ పై దాడి ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం

పంజాబ్ – పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పై ప‌శ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ఎన్నిక‌ల ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దారుణ‌మ‌ని సీఎం పేర్కొన్నారు. వ్య‌క్తుల‌పై దాడుల‌కు దిగ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని కోరారు. ప్ర‌జాస్వామ్యంలో దాడులకు చోటు లేద‌ని, ఆ విష‌యం బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తుంచు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు భ‌గ‌వంత్ మాన్.

మోడీ, అమిత్ షా ఒంటెద్దు పోక‌డ‌ల‌కు ఈ దాడి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. తాము మాత్ర‌మే ఈ దేశంలో ఉండాల‌ని, మిగ‌తా పార్టీలు, నేత‌లు ఉండ కూడ‌ద‌ని వారు అనుకుంటున్నార‌ని, అందుకే దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో తాము ఎలాగైనా సరే గెల‌వాల‌ని ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు భ‌గ‌వంత్ మాన్.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. పిరికి వాళ్లు మాత్ర‌మే దాడుల‌కు పాల్ప‌డ‌తార‌ని పేర్కొన్నారు. రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక దొడ్డి దారిన కేజ్రీవాల్ ను అంతం చేయాల‌ని ప్లాన్ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.