ఏసీబీకి చిక్కిన బోడుప్పల్ మున్సిపల్ ఏఈ
లంచం తీసుకుంటూ పట్టుబడిన రాజశేఖర్
హైదరాబాద్ – తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా దాడులు చేస్తోంది. పలు చోట్ల అవినీతి తిమింగలాలు పట్టు పడుతున్నాయి. బాజాప్తాగా లంచం డిమాండ్ చేస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో ఊహించని విధంగా ఏకంగా ఇటీవల రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా, ఘటకేసర్ పురపాలక సంఘానికి ఇంఛార్జ్ ఇంజనీర్ గా పని చేస్తున్న మంగూరపు రాజశేఖర్ ను లంచం తీసుకుంటుండగా పట్టుకుంది.
ఈ ఏడాది 2024లో జరిగిన గణేష్ నిమజ్జనంలో చేయబడిన పనికి సంబంధించి కొలతల పుస్తకం (ఎమ్-బుక్)ను ఆమోదించి, తదుపరి ప్రక్రియకు పంపడం కోసం రూ.50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఏఈ.
ఇదే విషయానికి సంబంధించి ఘట్కేసర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న “వర్క్ ఇన్‌స్పెక్టర్ (అవుట్ సోర్సింగ్) మేడి సున్నీ సదరు రాజశేఖర్ కు ఎమ్-బుక్‌ను వ్రాసి పంపడం కోసం ఇదివరకే రూ.30,000/- తీసుకున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా ఎవరైనా రాష్ట్రంలో లంచం అడిగితే వెంటనే ఏసీబీ ఆఫీస్ లోని 1064 అనే నెంబర్ కు డయల్ చేయాలని ఏసీబీ కమిషనర్ విన్నవించారు.