రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక యాత్రలు
ప్రకటించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి – రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. శనివారం రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించారు.
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒకరోజు టూర్ ప్యాకేజీని ప్రారంభించారు.
భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.
కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు నడిపిస్తామన్నారు. కాగా భక్తుల కోరిక మేరకు ఆదివారం కూడా ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు .
అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.
రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మార్చి నాటికి ప్రస్తుత టూరిజం పాలసీ ముగుస్తుందని ఏప్రిల్ 2025 నుంచి కొత్త టూరిజం పాలసీ అమల్లోకి తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
ఇప్పటికే కొత్త టూరిజం పాలసీకి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించామని పేర్కొన్నారు. టూరిజం శాఖలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అంశాన్ని పరిశీలిస్తున్నామని త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్, అధికారులు, అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు.