బుల్డోజర్ పాలన జనం ఆందోళన
గాడి తప్పిన ప్రజా పాలన
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ప్రజా పాలన వస్తుందని జనం ఆశించారని కానీ ప్రస్తుతం రాచరిక రాజ్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఏం సాధించారని ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు.
ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ప్రోగ్రెస్ ఉంటే కదా అని నిలదీశారు. ప్రచారం ఎక్కువ పని తక్కువగా ఉందన్నారు. గత పదేళ్లుగా ఎంతో కష్టపడి మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రాంతానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తే ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక ఏదో ఘన కార్యం సాధించినట్లు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. వార్షికోత్సవానికి బదులు సంవత్సరీకం అని పెట్టుకుంటే సరి పోతుందంటూ ఎద్దేవా చేశారు . ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, రైతు బంధు రానేలేదు, ఇక రుణ మాఫీ సగానికే పరిమితం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందంటూ మండిపడ్డారు . అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నా సోయి లేక పోవడం దారుణమని పేర్కొన్నారు.
మొత్తం ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనలో కేవలం బాగు పడింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, కుటుంబీకులు మాత్రమేనని సంచలన ఆరోపణలు చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ కానే కాదని మీరు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ ఎద్దేవా చేశారు.