NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ స్క్రిప్ట్ విజ‌య సాయి రెడ్డి కామెంట్స్

Share it with your family & friends

వైసీపీ ఎంపీపై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. త‌న‌పై నోరు పారేసుకున్న వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్ద‌మ‌న్నారు. ఇదంతా త‌న సోద‌రుడు, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను విజ‌య సాయి రెడ్డి మ‌క్కీకి మ‌క్కీ చ‌దివాడ‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని స‌వాల్ విసిరారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్సార్ మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని పేర్కొన్నారు.

మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళేన‌ని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ ష‌ర్మిల‌. వైఎస్సార్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాద‌న్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్సార్ అని, బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరంటూ గుర్తిస్తే మంచిద‌న్నారు.

వైఎస్సార్ మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించ లేద‌న్నారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు ? దోషులను ఎందుకు శిక్షించలేదు ? అనుమానం ఉండి, అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అని నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

వైఎస్సార్ మరణం తర్వాత చార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా ? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

చంద్రబాబుతో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్సార్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి అని అన్నారు.

జగన్ కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా అని మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.