సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్ – రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పిందని, కక్ష సాధింపు తప్ప మరేమీ లేదన్నారు. కావాలని కేటీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద మీడియాతో మాట్లాడారు. పాలన చేత కాక కేటీఆర్ ను టార్గెట్ చేశాడని మండిపడ్డారు. సీఎంకు కేటీఆర్ సిండ్రోం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రతి రోజూ కేసీఆర్ ఫ్యామిలీపై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే వివేకానంద.
కేటీఆర్ స్వంత బావ మరిది రాజ్ పాకాల ఇంటికి పోలీసులు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆబ్కారీ శాఖ పోలీసులు వెళ్లి సోదాలు జరిపారని, ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారంటూ ప్రశ్నించారు. అసలు సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఎలా సోదాలు జరుపుతారని నిలదీశారు వివేకానంద.
కేటీఆర్ ఫ్యామిలీని కావాలని ఇబ్బందులకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చెప్పినట్లు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. తాము అధికారంలోకి వచ్చాక తమను ఇబ్బంది పెట్టిన వారిని తప్పకుండా గుర్తు పెట్టుకుంటామని, వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.