31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు – ఈవో
శ్రీవారి భక్తులు గమనించాలని విన్నపం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతూ నిత్యం దేదీప్యమానంగా పూజలు అందుకుంటున్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువైన తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె . శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. వేలాదిగా తరలి వస్తుండడంతో , ఆ పవిత్రమైన రోజున దీపావళి పండుగ ఉందని, దీనిని పురస్కరించుకుని తాము బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు ఈవో శ్యామల రావు.
ప్రధానంగా 31వ తేదిన గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎవరైనా శ్రీవారి భక్తులు ఆరోజున సిఫారసు లేఖలు తీసుకు వచ్చినా అవి చెల్లుబాటు కావని, ఇబ్బందులు పడవద్దని కోరారు ఈవో జె. శ్యామల రావు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విన్నవించారు.