నవంబరులో విశేష పర్వదినాలు ఇవే – టీటీడీ
వెల్లడించిన ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నవంబర్ నెలలో విశేష పర్వదినాల వివరాలను తెలియ చేసింది. ఈ మేరకు శ్రీవారి భక్తులు ఆయా తేదీలలో స్వామి వారిని దర్శించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కీలక సూచనలు కూడా చేసింది టీటీడీ.
ఇదిలా ఉండగా తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. నవంబరు 1వ తేదీన కేదార గౌరీ వ్రతం చేపడతారు. 3వ తేదీన భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర నిర్వహిస్తారు. 5వ తేదీన నాగుల చవితి, పెద్ద శేష వాహనం ఉంటుందని పేర్కొంది టీటీడీ.
నవంబర్ 6వ తేదీన శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, 8వ తేదీన వార్షిక పుష్ప యాగానికి అంకురార్పణ ఉంటుంది. 9వ తేదీన శ్రీ వారి పుష్ప యాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర నిర్వహించడం జరుగుతుందని తెలిపింది టీటీడీ.
నవంబర్ 10వ తేదీన పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి, 13వ తేదీన కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి , 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి , 29న మాస శివ రాత్రి నిర్వహించనున్నట్లు వెల్లడించింది.