విజయ్ కామెంట్స్ పా రంజిత్ కంగ్రాట్స్
కుల..మతతత్వం..అవినీతికి వ్యతిరేకం
తమిళనాడు – తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు తళపతి విజయ్ ఆదివారం తమిళనాడు వేదికగా భారీ ఎత్తున సభను నిర్వహించారు. ఈ సందర్బంగా విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులం, మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తున్న మతం, ఆక్టోపస్ లా పేరుకు పోయిన అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతానని, తన పార్టీ ఇందు కోసం కృషి చేస్తుందని ప్రకటించారు తళపతి విజయ్. ఈ సందర్భంగా విజయ్ ను ప్రశంసించారు దర్శకుడు పా రంజిత్.
అంతే కాకుండా అణగారిన, బహుజన , మైనార్టీ వర్గాలకు అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యం కల్పిస్తానని ప్రకటించడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలనలో భాగస్వామ్యం, అధికారంలో పాలు పంచుకునేలా చేస్తానని ప్రకటించడం కూడా ఆనందం కలిగించిందన్నారు పా రంజిత్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు తళపతి విజయ్. ఆయనకు తమిళనాడే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచమంతటా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు పొందారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావడంతో తమిళనాడు పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి.