జన సంధ్రం తళపతి సంచలనం
నిండి పోయిన విక్రవాండి స్థలం
తమిళనాడు – టీవీకే అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తళపతి విజయ్ ఆధ్వర్యంలో తమిళనాడులోని విక్రవాండిలో నిర్వహించిన తొలి ప్రధాన రాజకీయ సమావేశం సక్సెస్ అయ్యింది. ఊహించని రీతిలో జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా అశేష జన వాహినిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు తళపతి విజయ్.
ఈ సందర్బంగా డయాస్ మీద ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలంతా సమానులేనని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ పాలనా పరంగా, అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు తళపతి విజయ్. ఆక్టోపస్ కంటే ఎక్కువగా పేరుకు పోయిన బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలను కూకటి వేళ్లతో పెకిలించడమే తమ ఉద్దేశమన్నారు .
భారత రాజ్యాంగం ప్రతిపాదించిన అన్ని హక్కులు ప్రతి ఒక్కరికీ చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో తమిళంతో పాటు ఇంగ్లీష్ భాష కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. మారుతున్న ప్రపంచంతో మనం కూడా పోటీ పడాలని పిలుపునిచ్చారు తళపతి విజయ్.