జనమే జెండా సమస్యలే ఎజెండా
టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్
తమిళనాడు – టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తళపతి విజయ్ నిప్పులు చెరిగారు. తమిళనాడు ప్రజలకు మెరుగైన జీవితాన్ని కల్పించడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. విల్లుపురంలో జరిగిన భారీ బహిరంగ సభ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. లక్షలాదిగా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.
టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం కనీసం 10 లక్షల మందికి పైగా జనం హాజరై ఉంటారని పేర్కొంటున్నారు. ఇది తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ సంచలనం అని చెప్పక తప్పదు.
ఈ సందర్బంగా అశేష జనవాహిని హర్షధ్వానాల మధ్య టీవీకే చీఫ్ తళపతి విజయ్ ప్రసంగించారు. జనమే జెండా అని సమస్యలే ఇక నుంచి తమ ప్రధాన ఎజెండాగా ఉంటుందని ప్రకటించారు. కులం, మతం, అవినీతి లేని తమిళనాడు తమ లక్ష్యమని స్పష్టం చేశారు టీవీకే ప్రెసిడెంట్.
ఇది ప్రచారం కోసం నిర్వహించిన సభ కానే కాదు. యావత్ తమిళ ప్రజల గొంతుకను ప్రపంచానికి వినిపించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం అని కుండ బద్దలు కొట్టారు తళపతి విజయ్. వచ్చే 2026లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా తమకు మద్దతు పలికేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.