కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చెల్లవు – హరీశ్
సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చర్యలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చిరంచారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బురద జల్లడంలో భాగంగానే కేటీఆర్ బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు జన్వాడ ఫాంహౌజ్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేసిందని ఆరోపించారు తన్నీరు హరీశ్ రావు.
రాజ్ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసన్నారు.
గత రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే, ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టం అవుతోందని ఆరోపించారు.
ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడి చేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు.
వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేటీఆర్, ఆయన సతీమణి గానీ ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లక పోయినా వెళ్లినట్టు చిత్రీకరించడం గర్హనీయం.
కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదన్నారు.
పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని కోరారు.