కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూ షురూ
పోలీసుల తిరుగుబాటుతోనే ఇది
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బలిదానాలు, త్యాగాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిత్యం కర్ఫ్యూలు అనేవి ఉండేవన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏనాడూ 144 సెక్షన్ నగరంలో విధించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.
ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, తదితర రంగాలలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణలో ఉన్నట్టుండి మళ్లీ కర్ఫ్యూలు ప్రారంభం కావడం నగర వాసులను విస్తు పోయేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రం ఏమిటంటే ఏకంగా నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, మత కలహాలు, కరెంట్ కోతలు, రైతులు, చేనేతన్నల ఆత్మహత్యలు, కేసులు, దాడులు, బడులుకు తాళాలు, శిశు మరణాలు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావడం పరిపాటిగా మారిందన్నారు. శాంతి భద్రతల పరంగా తెలంగాణ గతంలో టాప్ లో ఉండేదని, కానీ కాంగ్రెస్ కొలువు తీరాక కర్ఫ్యూ స్టార్ట్ కావడం దారుణమన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత .