గుంటూరు డిపోకు 100 విద్యుత్ బస్సులు
ఒకసారి ఛార్జి చేస్తే 150 కి.మీ. ప్రయాణం
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యుత్ బస్సులు ఇక ఏపీలో తిరగనున్నాయి. ఇప్పటికే కొన్ని రూట్లలో నడుస్తుండగా మరికొన్ని తిరుపతి నుంచి తిరుమల పుణ్య క్షేత్రానికి నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ.
సీఎం సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని డిపోలకు విద్యుత్ బస్సులను కేటాయించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లాకు సంబంధించి ఆర్టీసీ డిపోకు ఏకంగా 100 విద్యుత్ బస్సులు వచ్చాయి. ఒక్కో బస్సుకు సంబంధించి ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్లకు పైగా వస్తుంది.
విద్యుత్ బస్సుల అవసరాన్ని గుర్తించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. చ్చే 100 బస్సులను గుంటూరు ఆర్టీసీకి కేటాయించనున్నారు. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడుస్తాయి. మిగతా బస్సులన్ని పల్లెవెలుగు బస్సుల కింద తిప్పుతారు.
గుంటూరు నుంచి విజయవాడకు 20, పొన్నూరుకు 15, తెనాలికి 30, హైకోర్టుకు 5, సచివాలయానికి 5, చిలకలూరిపేటకు 10, సత్తెనపల్లికి 15 బస్సులు నడుపుతారు. ప్రస్తుతానికి 100 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న ప్రాంతాలకే వీటిని ఉపయోగిస్తారు. వీటికి ఛార్జింగ్ స్టేషన్ ను పెదకాకాని బస్టాండ్ వెనక ఆర్టీసీకి ఉన్న 3.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండ్ లో కూడా ఏర్పాటు చేస్తారు. గుంటూరులో ప్రధానంగా కాలుష్యం ఎక్కువవుతుండటంతో దీన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.