బీఈడీ అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్పీ ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ప్రధానంగా బీఈడీ అభ్యర్థుల గురించి పేర్కొన్నారు. తెలంగాణలో ఐదు లక్షల మంది బీఈడీ చేసిన వారు ఉన్నారని తెలిపారు.
వీరు ఎటూ కాకుండా పోతున్నారని ఆవేదన చెందారు. వారి పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారిందన్నారు. ఇటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 70 శాతం ప్రమోషన్స్ పేరుతో భర్తీ చేయడం వల్ల ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయడంతో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
విచిత్రం ఏమిటంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ( SGT ) పోస్టులకు వీళ్లు అర్హులు కాకపోవడం వల్ల జాబ్స్ కు దూరమవుతున్నారని వాపోయారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల జాబ్స్ లలో కేవలం 30 శాతం మాత్రమే కోటా కల్పించడం, మిగిలిన పోస్టులను ఎస్జీటీ నుంచి వచ్చే వారికి పదోన్నతి కల్పించడం తో బీఈడీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారని అన్నారు ఆర్ఎస్పీ.
వెంటనే యుద్ద ప్రాతిపదికన దీనిని పునః సమీక్షించాలని కోరారు. టీచర్ల భర్తీలో బీఈడీ వారికి డైరెక్ట్ కోటా కింద 30 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అప్పుడే బీఈడీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు.