కేసీఆర్ పేరు చెరిపేసే దమ్ముందా ..?
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న బీఆర్ఎస్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నిప్పులు చెరిగింది. బుధవారం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన కామెంట్స్ పై భగ్గుమంది. కేసీఆర్ పేరు చెరిపేస్తానని, ఒక ఏడాది తర్వాత ఉండదని చెప్పడం ఆయన అవివేకానికి, రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని పేర్కొంది.
చెరిపి వేయడానికి అది నీలాంటి తలకు మాసిన పెయింటర్ కాదన్నారు. పాత గోడల మీద రాసిన పేరు కాదని స్పస్టం చేసింది బీఆర్ఎస్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. అది నాలుగున్నర కోట్ల ప్రజల ఆర్తి గీతం. జనంతో విడదీయలేని బంధం. దానిని చెరిపేసేంత సీన్ లేదని పేర్కొంది .
కేసీఆర్ అంటేనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు తమలో భాగంగా మార్చుకున్న పేరు అని స్పష్టం చేసింది. తమ గుండెల మీద శాశ్వతంగా ముద్రించుకున్న పేరు కేసీఆర్ అని వెల్లడించింది. పాలనా పరంగా చేతకాక కేసీఆర్ మీద అవాకులు, చెవాకులు పేలుతుండడం దారుణమని మండిపడింది.
కేసీఆర్ ను అక్కున చేర్చుకున్న తెలంగాణను, కేసీఆర్ పేరు తర తరాలుగా నిలిచి ఉంటుందని, ఆ రెండింటిని తుడిచి వేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేసింది.