అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీతో లోకేష్ భేటీ
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విన్నపం
అమెరికా – అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా ప్రపంచంలో పేరు పొందిన ఐటీ, లాజిస్టిక్ కంపెనీలను కలుసుకున్నారు. తాజాగా బుధవారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు నారా లోకేష్. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు అమెజాన్ వెబ్ సర్వీస్ (AWS ) నాయకత్వం ఉపకరిస్తుందని తెలిపారు.
స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయని తెలిపారు. ఏఐ , మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఎఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలన్న తమ ఆశయానికి ఊతమిస్తాయని పేర్కొన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదలలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కీలకంగా మారనుందని, ఈ మేరకు సపోర్ట్ చేయాలని కోరారు.