తెలంగాణ గుండె గొంతుక కేసీఆర్
ఆయన ఆనవాళ్లు చెరిపేస్తానంటే ఎలా
హైదరాబాద్ – మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని, కేసీఆర్ అంటేనే తెలంగాణ అని, నాలుగున్నర కోట్ల ఆర్తి గీతం కేసీఆర్ అని ..ఆయనను ఏ శక్తి చెరిపి వేయలేదన్నారు .
బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు సబితా ఇంద్రా రెడ్డి. మీరు కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ కట్టించిందేనని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల మీటింగ్ పెట్టిన కమాండ్ కంట్రోల్ ప్రతి అడుగులో కేసీఆర్ కనిపిస్తారని, మీరు నిత్యం తిరిగే విదేశాలను తలపించే రోడ్లలో,ఫ్లై ఓవర్ లలో తెలంగాణ ప్రదాత కనిపిస్తారని గుర్తిస్తే మంచిదన్నారు.
ప్రజలు నిత్యం తాగే మిషన్ భగీరథ నీళ్లలో వారే కనిపిస్తారు..గ్రామాల్లో,పట్టణాల్లో కేసీఆర్ నల్లాలు, నీళ్లు అని అందరూ పిలుచు కుంటారని , ఇది తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు సబితా ఇంద్రా రెడ్డి.
కాళేశ్వరం జల సవ్వడిలో, కాకతీయ చెరువు మత్తిడిలో ,24 గంటలు విరజిమ్మీన విద్యుత్ వెలుగుల్లో, గురుకుల బడుల్లో,యాదాద్రి గుడిలో, జిల్లాకో వైద్య కళాశాల విప్లవంలో కేసీఆర్ గారు ఉంటారని అన్నారు
జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ట్యాంక్ బండ్ వద్ద అంబెడ్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి లాంటి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటే వాటితో పాటు, రైతు బంధు, రైతు భీమాలే కాదు చెప్పుకుంటూ పోతే సంక్షేమానికే చిరునామా గా మారిన కేసీఆర్ పేరును చెరపటం ఎవరి తరం కాదన్నారు.