NEWSTELANGANA

తెలంగాణ దిగ్గ‌జం..విస్మ‌రించ‌ని నిజం..కేసీఆర్

Share it with your family & friends

మ‌హానాయ‌కుడి పేరు చెరిపేసే ద‌మ్ముందా

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్య‌మ ర‌థ సార‌థి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి అనుచిత కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌తి అడుగులో, ప్ర‌తి గ‌డ‌ప‌లో , ప్ర‌తి మ‌లుపులో కేసీఆర్ ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని..ఇలాగే ఉంటాయ‌ని..త‌ర త‌రాలుగా అవి చెరిగి పోవ‌ని స్ప‌ష్టం చేశారు. గోడ‌ల మీద వేసే పెయింటింగ్ అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

సంబండ వ‌ర్ణాలు..క‌ల‌గ‌లిసి ఒక్క‌టైన గొంతుక‌..తెలంగాణ ఆత్మ ..ఆర్తి గీతం కేసీఆర్ అని ..అది గుర్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి మంచిద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మ కాలంలో గ‌న్ను పెట్టిన వాళ్ల‌కు ఘ‌న‌మైన పోరాట చ‌రిత్ర ఎట్లా తెలుస్తుంద‌ని అనుకోగ‌ల‌మ‌ని అన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

అనుభ‌వ రాహిత్యంతో , అధికారం ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే ప్ర‌జ‌లు ఊరుకోర‌ని అన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం..తెలంగాణ ఉంటుంద‌ని..నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం గుండెల్లో చెర‌గ‌ని ముద్ర కేసీఆర్ అని స్ప‌ష్టం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

సిద్దాంత ప‌రంగా విభేదించ‌వ‌చ్చు..కానీ ప‌నిగ‌ట్టుకుని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తే ఎవ‌రూ స‌హించ‌ర‌ని ఇది గుర్తిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని, కేసీఆర్ అంటేనే తెలంగాణ అని, రేవంత్ రెడ్డే కాదు .ఆయ‌న‌ను ఏ శ‌క్తి చెరిపి వేయ‌లేద‌న్నారు .

బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ప్రజలు నిత్యం తాగే మిషన్ భగీరథ నీళ్లలో , కాళేశ్వరం జల సవ్వడిలో, కాకతీయ చెరువు మత్తిడిలో ,24 గంటలు విరజిమ్మీన విద్యుత్ వెలుగుల్లో, గురుకుల బడుల్లో, యాదాద్రి గుడిలో, జిల్లాకో వైద్య కళాశాల విప్లవంలో కేసీఆర్ క‌నిపిస్తూనే ఉంటార‌ని స్ప‌ష్టంచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమానికే చిరునామా గా మారిన కేసీఆర్ పేరును చెర‌ప‌టం ఎవరి తరం కాదన్నారు.