NEWSANDHRA PRADESH

రాష్ట్రాభివృద్ధిలో మ‌హిళా సంఘాలు కీల‌కం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి పొంగూరు నారాయ‌ణ
విజయవాడ – రాష్ట్ర అభివృద్దిలో స్వ‌యం స‌హాయ‌క సంఘాలు అత్యంత కీల‌కంగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. బుధ‌వారం విజయవాడలో మెప్మా స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ పై శిక్షణ కార్యక్రమం చేప‌ట్టారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు మంత్రి నారాయణ. మెప్మా ఎండీ తేజ్ భరత్, అన్ని జిల్లాల పీడీ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

డ్వాక్రా, మెప్మా సభ్యులకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగు ప‌డుతుంద‌న్నారు. SHG సభ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తుంద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.

ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా చేరువ కావాలంటే డేటా ప్రొఫైలింగ్ ఎంతో అవసరం అని అన్నారు. సభ్యుల డేటా ఆధారంగా ఎవరెవరికి ఎలాంటి పథకాలు, చేయూత అందించాలనే దానిపై స్పష్టత వస్తుంద‌న్నారు

గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.పేదల కోసం తలపెట్టిన టిడ్కో ఇళ్లను కూడా నాశనం చేసిందని వాపోయారు.

ప్రొఫైల్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల డేటా ప్యూరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. డిసెంబర్ నెలాఖరు నాటికి డేటా బేస్ మొత్తం సిద్ధం చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి సభ్యుల డేటా ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళుతుంద‌న్నారు.