పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి
ఆయకట్టు వివరాలు లేక పోతే ఎలా
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో నీటి పారుదల శాఖ పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, వాటి కింద ఎంత ఆయకట్టు అమలు జరుగుతోందనే దానిపై పూర్తి వివరాలు వెంటనే అందజేయాలని ఆదేశించారు సీఎం.
ఇప్పటి వరకు ఎక్కడ ఎంత ఆయకట్టు ఉందనే విషయం , వాటి వివరాలు లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేకించి ప్రాజెక్టుల వారీగా ఆయకట్టుకు సంబంధించి కొంత గందర గోళం నెలకొందన్నారు రేవంత్ రెడ్డి.
గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలను సిద్దం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అందజేశారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీశారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. ఇది పూర్తయితే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించ వచ్చని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.