NEWSTELANGANA

రేపో మాపో అరెస్ట్ లు త‌ప్ప‌దు – కోమ‌టిరెడ్డి

Share it with your family & friends

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి

హైద‌రాబాద్ – రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విరుచుకు ప‌డ్డారు. సంతోష్ అయినా బినామీ ఓన‌ర్ మాత్రం ఆయ‌నేనంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

టానిక్ షాపుల ద్వారా రూ. 6 వేల కోట్లు సంపాదించార‌ని, ఇవ‌న్నీ ఎలా వచ్చాయో చెప్పాల‌ని నిల‌దీశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రేపో మాపో అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా దీపావ‌ళి కంటే బాంబులు పేల‌బోతున్నాయ‌ని ఇప్ప‌టికే రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌ర‌క‌టించ‌డం, ఆ త‌ర్వాత కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ అంత‌టా వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 28 వ‌ర‌కు 144 సెక్ష‌న్ విధించిన‌ట్లు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ప్ర‌కటించారు. దీంతో బీఆర్ఎస్ కు చెందిన నేత‌ల‌ను అరెస్ట్ చేస్తే ముంద‌స్తుగా ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌కుండా ఉండేందుకు, ఎలాంటి అల్ల‌ర్లు చెల‌రేగకుండా ఉండేందుకే ఇలా చేశార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.