ముగిసిన శ్రీ వేంకటేశ్వరుడి పవిత్రోత్సవాలు
భారీ ఎత్తున దర్శించుకున్న భక్త బాంధవులు
తిరుపతి – శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.
ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ అర్చకులు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు.