DEVOTIONAL

రూ. 44 ల‌క్ష‌లు విరాళంతో ఒక రోజు అన్న‌దానం

Share it with your family & friends

అవ‌కాశం క‌ల్పించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విష‌యం విదిత‌మే.

ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కు సంబంధించి రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.

విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4( పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోందని తెలిపింది టీటీడీ.

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల మరియు తిరుపతిలలో రోజుకు
దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తున్నదని టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు.