ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం – అనిత
అధికారుల నిర్వాకంపై మంత్రి ఆగ్రహం
అనకాపల్లి – తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్లుగా మహిళలు జగన్ రెడ్డి హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు వంగలపూడి అనిత.
గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర ధరలు పెరిగాయని, తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు అనిత. అప్పట్లో మహిళల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దీపం పథకం ప్రవేశ పెట్టారని చెప్పారు . తిరిగి ఈసారి కూడా దీపం -2 పథకం ప్రవేశ పెట్టారని, మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదన్నారు. త్వరలో పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆకలిని తీర్చడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అనకాపల్లి, పాయకరావుపేటలకు తగిన రీతిలో గుర్తింపు తీసుకు వస్తామని ప్రకటించారు వంగలపూడి అనిత.