శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు ప్రత్యేక బస్సులు
ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే శ్రీ కురుమూర్తి స్వామి జాతర ను పురస్కరించుకుని పెద్ద ఎత్తున బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోందని తెలిపారు. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదిన ఉండగా.. 7 నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అందుకే స్పెషల్ బస్సులను వేస్తున్నట్లు పేర్కొన్నారు ఎండీ.
ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోందని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా జాతరకు వెళతాయని వెల్లడించారు ఎండీ. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ కల్పిస్తోందని తెలిపారు.
టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని భక్తులకు సూచించారు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించు కోవాలని ఎండీ కోరారు.