మెరుగైన సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – మెరుగైన సంక్షేమం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలోనూ… బయట చేస్తున్న ప్రతి ఆగడంపైనా నిఘా ఉందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
‘వైసీపీ నాయకులకు, మద్దతుదారులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు. ప్రజలు వారికి 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టినా వారి తీరులో మార్పులేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయిట్లు వైసీపీ నాయకులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా ఊరుకొనేది లేదని, అలాంటి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిఘా ఉంటుందని చెప్పారు.