100 రోజుల్లో 100 అత్యాచారాలు – రోజా
ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
అమరావతి – ఏపీ మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. 100 రోజుల ఏపీ కూటమి ప్రభుత్వ పాలనలో 100కు పైగా అత్యాచారాలు చోటు చేసుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు.
కూటమి సర్కార్ చేతకాని తనం వల్లనే నేరస్థులకు భయం లేకుండా పోయిందన్నారు. ఎక్కడ పడితే అక్కడ హత్యలు, దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అసలు సోయి అన్నది వీరికి ఉందా అని నిలదీశారు ఆర్కే రోజా సెల్వమణి. బెల్టు షాపుల ద్వారా మద్యం విచ్చల విడిగా పెంచేశారని, దీంతో మద్యం ఏరులై పారుతోందని అన్నారు.
రాష్ట్రంలో ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం మందు బాబులను తయారు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వ పాలన అంటూ ప్రశ్నించారు.