NEWSANDHRA PRADESH

రుషి కొండ ప్యాలెస్ పై ఆలోచిస్తాం

Share it with your family & friends

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌ప‌ట్నం జిల్లా – ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రుషి కొండ ప్యాలెస్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరికోరి భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి రుషి కొండ ప్యాలెస్ (భ‌వ‌నం )ను నిర్మించారు. వంద‌ల కోట్లు కుమ్మ‌రించారు. దీనిని అత్యాధునిక సౌక‌ర్యాల‌తో నిర్మించారు రుషికొండ‌ను.

ఇదిలా ఉండ‌గా ఏపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల కార‌ణంగా జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ను కోల్పోయింది. తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్బంగా ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు ఇప్ప‌టికే ప‌లుమార్లు రుషి కొండ ప్యాలెస్ ను సంద‌ర్శించారు. దీనిని ఏం చేయాల‌నే దానిపై ఆలోచిస్తున్న‌ట్లు తెలిపారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రుషికొండను సంద‌ర్శించారు.

వందల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు చేసి గత పాలకులు నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించారు. ప్రజాధనం అంటే బాధ్యత లేని…ప్రజలంటే లెక్కలేని….ప్రజాస్వామ్యం అంటే భయంలేని పాలకులు కట్టిన నిర్మాణాలను మీడియా, ప్రజాప్రతినిధులతో కలిసి సంద‌ర్శించారు.

ప్రభుత్వ సొమ్ముతో కోట్లు కుమ్మరించి వ్యక్తిగత విలాసాలకు కట్టిన ఆ భవనాలను రాష్ట్రం కోసం ఎలా ఉపయోగించుకోవాలో చర్చిస్తున్నామ‌ని తెలిపారు సీఎం. అందరి సూచనలు, సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.