NEWSANDHRA PRADESH

ఒక చేత్తో ఇచ్చి మ‌రో చేత్తో లాక్కుంటే ఎలా ..?

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. దీపం 2 ప‌థ‌కం పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ ఆరోపించారు. 3 సిలిండ‌ర్లు ఇస్తున్నామంటూ గొప్ప‌లు చెబుతూ మ‌రో వైపు నిట్ట నిలువునా మోసం చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

కూటమి సర్కార్… విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిప‌డ్డారు.. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ ఎద్దేవా చేశారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6 వేల కోట్లు అని వెల్ల‌డించారు.

ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అద‌న‌పు భారం పడుతుంది అని తెలిపారు. . దీపం – 2 కింద వెలుగులు పక్కన పెడితే .. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు అని ఆరోపించారు. గత వైసిపి చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఏపీ ఈఆర్సీ అని, తాము కాదంటూ కుంటి సాకులు చెప్ప‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన విష‌యం అప్పుడే మ‌రిచి పోయారా చంద్ర‌బాబూ అంటూ నిప్పులు చెరిగారు.