DEVOTIONAL

5న మలయప్ప స్వామి దర్శనం

Share it with your family & friends

ఉభ‌య దేవేరుల‌తో క‌లిసి ఆశీర్వాదం

తిరుమ‌ల – తిరుమలలో నవంబరు 5వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వ‌దినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనం ఇవ్వనున్నారు. సర్ప రాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామి వారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్ర నామాలతో శేష సాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామి వారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.

ఈ విధంగా స్వామి వారు, దాస భక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి తిరు వీధులలో విహరిస్తూ భక్తులకు అభయం ఇవ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు.

అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆది శేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.