DEVOTIONAL

శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ఉత్స‌వాలు

Share it with your family & friends

విశేష పూజ హోమ మ‌హోత్స‌వం

తిరుప‌తి – తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమంతో విశేష పూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించారు. 3, 4వ తేదీల‌లో కూడా గణపతి హోమం జరుగనుంది.

5 నుండి 7వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామి వారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 7న సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య స్వామి వారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా 8న శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మ వారిహోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం (రుద్రహోమం) నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబరు 29న శ్రీ శివ‌పార్వ‌తుల క‌ల్యాణం చేప‌డ‌తారు.

30న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 1న శ్రీచండికేశ్వర స్వామి వారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొన‌డం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈవో సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్లు కృష్ణ‌వ‌ర్మ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ బాల‌క్రిష్ణ‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.