సీఎం చెప్పుచేతల్లో బీసీ కమిషన్ – దాసోజు
రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కుల గణనకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసిందని, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇంత వరకు ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు. అగవర్ణపు భావజాలాన్ని వంట బట్టించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కావాలని బీసీలకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు.
కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, చాలా రోజుల తర్వాత బీసీ జనాభా లెక్కించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. హైకోర్టు కులగణన సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసిందని కానీ సర్కార్ ఆ దిశగా ఆలోచించడం లేదని ఆరోపించారు.
మళ్ళీ కాలయాపన జరిగే ప్రమాదం ఉందని అట్టడుగు వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కుల గణనలో చేసిన తప్పిదాలే ఇక్కడ చేస్తున్నారని ఆరోపించారు .
రాహుల్ గాంధీ కుల గణన ఓ ఎక్స్ రే లాంటిదని అంటున్నారని, కానీ తాము దానిని ఎంఆర్ఐ లాంటిదని అంటున్నామని చెప్పారు. కులాలు, ఉపకులాల జనాభా సర్వేతో కచ్చితంగా తేలుతుందన్నారు. తప్పిదాలు చేయకుండా సెన్సస్ జాగ్రత్తగా చేయాలని సూచించారు.