ప్రశ్నిస్తే కేసులు పోరాడితే సస్పెన్షన్లు
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని, పోరాడితే సస్పెన్షన్లతో భయ భ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే చివరకు ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని హితవు పలికారు.
ఇకనైనా ఒంటెద్దు పోకడలు మాను కోవాలని, ప్రజలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎక్కడా నిర్బంధం విధించడం జరగలేదన్నారు. కానీ ఈ 11 ఏళ్ల కాంగ్రెస్ పాలనలతో తెలంగాణ పూర్తిగా పోలీసుల నిర్బంధంలోకి వెళ్లిందని ఆరోపించారు కేటీఆర్.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నాం కానీ ఎమర్జెన్సీ రోజులు వస్తాయని అనుకోలేదని ఎద్దేవా చేశారు . ప్రజాస్వామిక తెలంగాణలో ఇప్పుడు ప్రశ్నించడమే నేరంగా మారడం ఎంత దుర్భరం అంటూ మండిపడ్డారు. నిర్బంధం విధించినా, కేసులు నమోదు చేసినా తాము పోరాడుతూనే ఉంటామని, ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్.