ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకులాలకు శాపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాలకు శాపంగా మారిందని ఆరోపించారు. ఆదివారం ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు. సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు విద్యా రంగం పట్ల అనుసరిస్తున్న విధానాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన చెందారు.
ప్రధానంగా గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులకు శాపంగా మారిందని వాపోయారు. ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా తయారైందని మండిపడ్డారు. అయినా సోయి తప్పి మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేక పోవడం దుర్మార్గం అన్నారు తన్నీరు హరీశ్ రావు.
స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.
వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారని నిలదీశారు తన్నీరు హరీశ్ రావు.
విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉందని, రోజు రోజుకు దిగజారుతున్న విద్యా ప్రమాణాలను ఎవరు బాగు చేస్తారని అన్నారు.