అడ్డగోలు హామీలు ప్రజలకు శాపాలు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నెరవేర్చలేక పోతోందని అన్నారు. దీంతో ప్రజలలో అసహనం నెలకొందని, ఎప్పుడు అది తీవ్ర రూపం దాల్చుతుందో చెప్పలేమన్నారు. ఇకనైనా ఏఐసీసీ గమనిస్తే మంచిదని హితవు పలికారు.
గాలి మాటల గ్యారెంటీలిస్తే..మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని నిలదీశారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ఎద్దేవా చేశారు కేటీఆర్.
బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధ పడిందా అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. ఏవీ చూసుకోకుండా కేవలం అధికారమే లక్ష్యంగా..కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో..తెలంగాణ రాష్ట్రం.. ఏడాదిలోనే ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
తెలంగాణ ప్రజలను నమ్మించి.. నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ.. నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు .