బీఆర్ నాయుడుతో పరిటాల శ్రీరామ్ భేటీ
టీటీడీ నూతన చైర్మన్ కు అభినందనలు
హైదరాబాద్ – అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ మర్యాద పూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడును కలిశారు. ఈ సందర్బంగా ఆయనకు అభినందనలు తెలిపారు. నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తనను ప్రత్యేకంగా కలవడమే కాకుండా అభినందించిన టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ కు, పరిటాల కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు టీవీ5 చైర్మన్ , టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు. తాను శక్తి వంచన లేకుండా టీటీడీని పరిరక్షిస్తానని, అక్కడ హిందువులకు మాత్రమే చోటు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే టీటీడీలో అన్యమతస్తులు ఎవరైనా ఉన్నా, లేదా వివిధ విభాగాలలో పని చేస్తుంటే వారిని ఇతర శాఖల్లోకి బదిలీ చేయడమో లేదా స్వచ్చంధ పదవీ విరమణ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎం నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు.
ఇదే సమయంలో యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ తో చాలా సేపు వివిధ అంశాలపై చర్చించారు బీఆర్ నాయుడు.