అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్
టీటీడీ బోర్డులో హిందువులే ఉండాలా
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ఏపీ కూటమి సర్కార్ 24 మందితో కూడిన టీటీడీ పాలక మండలిని నియమించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
టీవీ5 చైర్మన్ , వ్యాపారవేత్త బీఆర్ నాయుడు ను చైర్మన్ గా చేశారు. ఆయన తాజాగా కేవలం తిరుమల ఆలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలని, వారు మాత్రమే పని చేసేలా తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై తాను సీఎంతో మాట్లాడతానని ప్రకటించారు.
దీనిపై సీరియస్ అయ్యారు అసదుద్దీన్ ఓవైసీ. టీటీడీ బోర్డుపై మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ బిల్లును తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఇదే సమయంలో టీటీడీ బోర్డులో ఎందుకు ఇతర మతస్తులు ఉండ కూడదని ప్రశ్నించారు. హిందువులకు ఒక న్యాయం ముస్లింలకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ ఓవైసీ. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇంకా హిందూ సంఘాలు, సంస్థలు, నేతలు స్పందించ లేదు.