గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం – అనిత
చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సాయం
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు వంగలపూడి అనిత. అనంతరం ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా సర్కార్ తరపున రూ. 10 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు మంత్రి .
చిన్నారిపై అఘాయిత్యంకు సంబంధించిన వార్త తనను కలిచి వేసిందన్నారు . చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం గురించి మరింత గుండె బరువెక్కిందన్నారు వంగలపూడి అనిత. ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశామని చెప్పారు.
క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఎన్నో ఘటనలు జరిగాయని అన్నారు . నిందితుడికి 2, 3 నెలల్లో కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని.. తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సిసి కెమెరాలు నిర్వీర్యం చేశారని, గంజాయి, నకిలీ మద్యం విచ్చల విడిగా అందుబాటులో ఉండడం వల్ల యువత వాటికి అలవాటు పడ్డారని ఆరోపించారు.
త్వరలోనే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం కూడా లభించిందని చెప్పారు వంగలపూడి అనిత.